సృష్టించుకొనుట … దాని పర్యవసనాలు
బ్రహ్మర్షి పితామహ పత్రీజీ మనందరికీ అందించిన కాన్సెప్టులలో ప్రతి వ్యక్తి నిత్యజీవితంలో శరీర విరమణ చేసేవరకు గుర్తుపెట్టుకుని వ్యవహరించవలసిన ముఖ్యమైన కాన్సెప్టు..
నిత్యజీవితంలో ఒక నాస్తికుడైనా లేదా ఆస్తికుడైనా జీవితాంతం మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో ,కోరిన కోర్కెలు అన్నీ తీర్చుకుంటూ ,ఎటువంటి సమస్యలు లేకుండా , కావలసినంత మనశ్శాంతితో ఆనందంగా జీవించాలనే కోరుకుంటారు.
అయితే మిడిమిడి ఆధ్యాత్మిక జ్ఞానంతో, రకరకాల మూర్ఖాచారాలతో , మూఢవిశ్వాసాలతో, ప్రకృతి సిద్ధాంతాల గమనికలేకుండానే , అటు దైవత్వం అంటే ఏమిటో, వాటి విలువలు ఏమిటో పూర్తిగా తెలియక, తన మీద తనకే పూర్తి నమ్మకం లేక అంతా విధి వ్రాత అంటూ నిరాశ, నిస్పృహలతో జీవిస్తున్న ఆస్తికుల కంటే…
ఏ దేవుడు లేడు కంటికి కనిపిస్తున్న స్థూల ప్రపంచం తప్ప మరేమీ లేదన్న నాస్తికులే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం మరి విశ్వాసం ఉంది. అందువలన కష్టపడి పని చేస్తూ పనికి సరిపడా ఫలితం అంటూ శ్రమజీవులుగా ఉంటారు.
మరి ఆస్తికులుగా చెప్పుకునే మెజారిటీ జనులు పూర్తిగా దైవత్వాన్ని తెలుసుకోలేక వారి మీద వారికీ పూర్తి నమ్మకం లేక రెంటికి చెడ్డ రేవడిగా కాలం వెళ్ళబుచ్చు తుంటారు.
ఇక పాయింట్ కి వద్దాం :
మేనిఫెస్టేషన్ (సృష్టించుకొనుట)- కాన్సీక్వెనసెస్ ( పర్యవసానాలు) నాస్తికులను కాసేపు పక్కన పెడదాం. ఇక ఆస్తికులు అంటారా “అహం బ్రహ్మాస్మి ” అని సనాతన ధర్మం చెప్పినా, “మనమే దేవుళ్లం” అని
న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ చెప్పినా ఏది ” సనాతనమో” అదే “అధునాతనము” కూడా ఎందుకంటే “సత్యం” ఎన్నటికీ మారేది కాదు అది ఎన్నటికీ “నిత్యమైనది” కాబట్టి.
ఎప్పుడైతే ఈ వాస్తవం అర్థం అవుతుందో సామాజికంగా ద్వైత భావనలో వ్యవహరించినా , ఆధ్యాత్మికంగా ఉన్నదంతా అద్వైతమే,అనే ఎరుక కలుగుతుందో,ఇది సదా ఆచరణలోకి వచ్చినప్పుడు “మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం” అన్న సత్యం అనుభవానికి వస్తుంది ఏ వ్యక్తికైనా!
అయితే ఏది మన వాస్తవం ?
సృష్టి ఆరంభంలో ఉన్న మూలచైతన్యము నుంచి విడివడి వచ్చిన ఆ చైతన్య శకలాలమే మనమంతా. ఆ చైతన్య శకలమే సకల జీవులలో “ఆత్మ” అనే పేరు మీద తిరుగాడు తుంది. అందువలన ఈ భూప్రపంచంలో ఉన్న సకల జీవ రాశులలోనూ అంతర్గతంగా ఉన్నది ఆ ఆత్మ పదార్థమే. అదే సత్యము ఆదేనిత్యము.
ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాము?
సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నప్పటికీ, ఈ భూగ్రహం తో పాటు మిగిలిన గ్రహాలు అన్నీ కలిసి ఒక సౌర కుటుంబం గా వ్యవహరిస్తుంది. ఈ సౌర కుటుంబంలో భూమి అన్నది ఒక గోళం. ఇక్కడ ఉన్న జీవరాసులు అన్ని ప్రకృతిలో ఒక భాగమే. పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి యొక్క ఘనీభవించే స్థితి ద్వారానే మనిషికి స్పర్శ జ్ఞానం వస్తుంది. ప్రారంభంలో మనమంతా దైవ పదార్థాలుగా ఉంటూనే ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి అంటే స్పర్శా జ్ఞానం ద్వారా కలిగే కొత్త అనుభవాలు పొందటానికే, ఈ భూమిపైకి రావటం జరిగింది. (దేహమేదేవాలయం -అంటే ప్రకృతి – జీవుడే దేవుడు)
తర్వాత ఏమి జరిగింది?
దివ్యత్వపు శక్తులు కలిగిన మానవదేహదారులు ఈ భూగ్రహంపై ప్రకృతి యొక్క సోయగాలను చూస్తూ, ఆస్వాదిస్తూ ఇక చాలు ( అదే ముక్తి-మోక్షం) అనుకున్నప్పుడు పై లోకాలకు వెళ్లిపోయేవారు. అప్పటివరకు వారి దైవత్వపు శక్తులు వారితోనే ఉన్నవి.
మరి ఇప్పుడు:-
ప్రకృతి యొక్క అందచందాలకు, అతిగా ఆకర్షణకు లోనై, దివ్యత్వపు శక్తులతో విరాజిల్లుతున్న మానవ దేహదారులలో ఇది నా సొంతమై తే బాగుండును అన్న దురాశ కలిగింది. ఆ దురాశ ఫలితమే తనకున్న దివ్యశక్తులు కోల్పోవడం, కర్మ బంధాలలో ఇరుక్కుపోవడం, “పునరపి జననం – పునరపిమరణం ” అంటూవందల వేల జన్మలు ఈ భూమి చుట్టూ తిరుగాడుతూ తన దైవత్వాన్ని మరచి అల్పమైన మానవత్వాన్ని ఆపాదించుకుంటూ బందీగా జీవిస్తున్నాడు.
ఆధ్యాత్మిక గురువులు ఆవిర్భావం:-
అంతరంలో దివ్యత్వం అయిన ఆత్మ ఉన్నప్పటికీ ప్రకృతి యొక్క మాయలో తన సహజత్వాన్ని మరచి, ఈ భూ గ్రహానికి పరిమితమైన జీవుల యదార్థ స్థితి వారికి తెలియజేసి, బంధరాహిత్యం కలిగించడానికి( మోక్షానికి దారి) గురువులు ఆవిర్భావం జరిగింది. ఇక్కడ గురువులు అంటే పరిపూర్ణమైన సృష్టి రహస్యాలు అన్నీ అనుభూతి చెంది ,అంతరంలో దివ్యత్వంతో నిండి ఉన్న మానవ మహోన్నతులు. మరి మనసంగతి అంతర్గతంగా దైవాలమే అయినా , ఏ మానవ అనుభవాలు పొందటానికి ఈ భూమిపైకి వచ్చామో ,అదే పరిమితమైన మానవ మాత్రుడుగా మాత్రమే జీవించగలుగుతూన్న మనకు , ఈ భూ ప్రపంచమంతా ప్రాకృతిక జీవితంతో అనుభవాలు పొందటానికి ఇక్కడకు వచ్చామని, ఇక్కడ నాదేమీ లేదు అన్న జ్ఞానపరమైన అవగాహన పెంచుకొని, బంధరాహిత్యంతో జీవిస్తే కానీ తిరిగి మన దైవత్వం యొక్క శక్తులు పునరుద్ధరణ జరగదు అన్నవిషయ పరిజ్ఞానం కలగాలి . కాబట్టి మానవజాతి యొక్క సదరు మేలుకొలుపు కొరకే సరైన గురువుల ఆవిర్భావం జరిగింది
తెలుసుకోవలిసిన విషయం : త్రేతాయుగంలో శ్రీరాముని లో ఉన్న దైవత్వం రామునికి తెలియకనే అన్ని కష్టాలు పడ్డాడా ,కాదు మానవునిగా జన్మించి మానవ అనుభవాలు మొత్తం పొందటానికే ఆ జన్మ.
మన కర్తవ్యం ఏమిటి?
బ్రహ్మర్షి పత్రీజీ లాంటి గురువుల సాంగత్యంతో యదార్ధమైన సత్య సాధన ద్వారా ఆత్మానుభూతి చెంది “అన్నిటా ఉంటూ దేనికీ అంటబడ కుండా” జీవిస్తూ ఈ జన్మను ఆఖరిజన్మగా చేసుకోగలిగితే “పునరపి జననం పునరపి మరణం” అన్న జీవిత చక్రంలో నుండి బయటపడగలం.
అసలు కాన్సెప్ట్ మరిచారా ! లేదు
బ్రహ్మర్షి పితామహా పత్రీజీ మాటలలో….
చాలా సంతోషం – మనమంతా దేవుళ్ళo అన్న విషయాన్ని మీరు అంతా చక్కగా గ్రహించగలిగారు. దేవుళ్ళ కాబట్టి సహస్రృష్టి కర్తలం, కాబట్టి మనకు ఏది కావాలంటే దానిని సృష్టించుకునే హక్కు మనకు ఉంది. అందువలన జీవితాలు అల్పంగా ఎందుకు ఉండాలి , హుందాగానే ఉండాలి, కాబట్టి సంపదలు సృష్టించుకుందాం ఆనందంగా జీవిద్దాం, ఇదేగా మీరు చెప్పేది ,ఓ కే అయితే మీరంతా సృష్టించుకునే దగ్గర ఆగిపోతూ ఉన్నారు , కానీ ఆగవలసింది అక్కడ కాదు . ప్రతి సృష్టికీ దాని పర్యవసానాలు దానికి తప్పకుండా ఉంటాయి. అందువలన ఏది సృష్టించుకోవాలన్నా దాని పర్యవసానాలు దృష్టిలో పెట్టుకుని అక్కడకు వెళ్లి మీరు ఆగాలి, అంతేకానీ సృష్టి దగ్గర ఆగిపోతే దాని పర్యావసానాలు ఎవరు అనుభవిస్తారు. అందువలన ఆగవలసింది సృష్టి దగ్గర కాకుండా పర్యవసా నాలు దగ్గర అంటూ రకరకాల ఉపమానాలు అందించారు. తేలికగా అర్థం అవటానికి–
ఉదా : 1 ఒక పిరమిడ్ కట్టాలనుకుంటాం, అప్పో సప్పో , చందాలో మొత్తం మీద పిరమిడ్ పూర్తయింది. కాలక్రమంలో దాని బాగోగులు ఎవరు చూడాలి? ఎలా చూడాలి? అది పర్యవసానం అంటే.
2. మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఏ బ్యాంకు లోనుతోనో,ఇల్లు పూర్తి అయింది. లోన్లు కట్టగలగాలి, ప్రతి నెల కట్టవలసిన వాయిదాలు సరిగా కట్టకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి.?
3. అబ్బాయిని మంచి స్కూల్లో చదివించాలి ఆలోచన బాగుంది. మరి మన ఆర్థిక స్తోమతకు మించి వెళితే పర్యవసానాలు ఇలా ఒకటి కాదు నిత్య జీవితంలో ప్రతి సృష్టికి దాని పర్యవసానాలు దానికి ఉండితీరతాయి.
కాబట్టి ఒక ఎన్లైటెన్మెంట్ మాస్టరు పర్యవసానాలు దృష్టిలో పెట్టుకుని సృష్టికి దిగాలి ఇది సారాంశం.ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పుకోవచ్చు
అందుకే పత్రీజీ అన్నారు
ఈ భూ ప్రపంచంలో ” నే ను – నాది” వదలగలిగితే ఉన్నదంతా నీది కాకపోతే మరెవరిది? అంతగా సత్యంతో అంటే ఆత్మవత్ జీవించబట్టే చేతిలో రూపాయి లేకుండా ప్రపంచమంతా తిరగగలిగారు అటువంటి గురువు మార్గదర్శకంలో మనం ఏ స్థాయికి ఎదిగామో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా!
....ముగింపుగా !
ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసి మనమూ సంపదల వెనక పరుగులు తీస్తే, ఏమీ తెలియని నాస్తికులు కూడా సంపదల వెనకే పరుగులు తీస్తే ఇంకెక్కడిది ఆధ్యాత్మికత?
ధర్మబద్ధంగా ఉండు, అకర్ముడుగా ఉండటానికి వీలులేదు. కర్మలు చేస్తూనే ఉండాలి, కానీ దేనికీ అంట బడకూడదు అన్న గీతాచార్యుని బోధలు ఏమైనట్లు? అలా అని డబ్బుకు, సంపాదనకు వ్యతిరేకం కాదు..
ప్రపంచమంతా దుఃఖం లోనే ఉంది సదరు దుఃఖానికి కారణం తృష్ణ అన్న బుద్దుని సందేశాలు ఏమైనాయి ?
” బ్రహ్మసత్యం -జగత్ మిద్య” అన్న శంకరాచార్యుల సత్య వాక్కు లకు అర్థము ఏమిటి
.ఏ ఆద్యాత్మిక శాస్త్ర వేత్త లయనా భౌతిక సంపదల వెంటపడ్డారా? లేక జ్ఞాన సంపదల వెంట పడ్డారా?
అర్థం చేసుకుని జీవించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ. ( స్వ +ఇచ్చ ) కాబట్టి ఎవరి స్వేచ్ఛ వారిది.
దన్యవాదాలతో
బ్రహ్మర్షి జక్కా రాఘవరావు
“ పిరమిడ్ హౌస్”
విజయవాడ
మొబైల్: 9848170801