
అమ్మా…
అభ్యుదయ కుటుంబంలో పుట్టావు, అందరితోనే మనము అని నేర్చావు
పేరంటాళ్ళమ్మ ఇలవేల్పై, దైవమే వెలిచిన కుటుంబమున మెట్టావు
అయినా కష్ట కాలంలో అడుగు పెట్టావు, అందుకే దేహాన్ని లోహాన్ని చేసావు
కట్టెలు, బొగ్గులు, వేరులు, నిమ్మకాయలు, చల్లద్రవాలు, ఇవే జీవితమైనా భరించావు
ఒంటె గది ఇంట సంసారమును నడిపించావు, కన్నీరే ప్రవాహమైనా సహించావు
సమగ్ర ఇంటిళ్లపాది బరువంతా మోసావు, అందరి కోసం సడలక నిలిచావు
ఓర్పు, సహనము, అణుకువలతో మెలిగావు, సమగ్ర కుటుంబ మన్ననలని గెలిచావు
అటు పుట్టినింట, ఇటు మెట్టినింట, కుటుంబాలన్నింటికీ ఆదర్శ ప్రాయం అయ్యావు
వారి సంసార బాధ్యతలని ఎలా అవగాహన చేసుకోవాలో, సన్మార్గమున ఎలా సర్దుకోవాలో, జీవించి చూపించావు
అమ్మా…
ఎదిగిన పిల్లలు అడుగు బయట పెట్టగా, ఆధ్యాత్మికతలో అడుగు పెట్టావు
పత్రి గారి దారిని పట్టావు, శ్వాస మీద ధ్యాస పెట్టావు
లోహమైన దేహాన్ని ధ్యానంతో కరిగించావు, పిరమిడ్ హౌసుకి శక్తి స్థాపన చేసావు
అడుగెట్టిన వారందరికీ, కొందరేయైనా ఎందరోయైనా, పగలైనా రేయైనా
అలుపెరగక అన్న దానము చేసావు, అన్నపూర్ణేశ్వరిలా కొలవబడ్డావు
భర్త వెన్నుంటి ధ్యాన ప్రచారానికి, శాఖాహార ర్యాలీలకి నడుం కట్టవు
విజయవాడ, శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞాలకు అండగా నిలిచావు
విద్వత్ మహిళాభివృద్ధికి అంకురం కట్టావు
ధ్యానవిద్వరిష్ట పద్మ జక్కా గా కాంతి స్వరూపిణి వయ్యావు
అయినా, అందరికి ఇంటిపట్టునున్న అమ్మలానే అనిపిస్తావు, ఆప్యాయంగా ఆదరిస్తావు
అమ్మా…
భూదేవికున్నంత సహనంతో, పార్వతీదేవి చేసినంత సాధనతో,
సరస్వతిదేవిలా జ్ఞానంతో, పద్మపత్రమివాంభసా తత్వంతో
మూర్తీభవించిన భూతల దేవీస్వరూపమా
నీ పాద పద్మములకు ఇవే మా నమసుమాంజలిలు…